శ్రీ భగవద్గీత అథః ప్రథమోధ్యాయః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీ భగవద్గీత
అథః ప్రథమోధ్యాయః
కం. అంతట ధృతరాష్ట్రుడు
తన చెంతకు సంజయుని పిలిచి
చెప్పు మమాత్యా, సుంతయు వీడక
యుద్ధం బంతయు నే రీతి జరుపబడెనో అచటన్.... (0)
సీ. ధర్మక్షేత్రం బది- తగ కురుక్షేత్రంబు,
అందుయుద్ధము చేయ -
నభిలషించి,
నా కుమారులు, మరి- నా సోదరుడు పాండు
భూపాలతనయులా - ప్రొద్దునందు,
ఏమి చేసిరి? అన స్వామికి సంజయుం
డీరీతి పలికె నో కురునరేంద్ర!
పాండవానీకంబు -పరికించి రారాజు
గురు కుంభసంభవు- దరికి చేరి
పలికె నీ రీతి కంటిరే -బాగ తమరి
శిష్యుడా దృష్ట దుమ్యుని -చేష్ట లతని
చేత విరచిత వ్యూహాన- సేన బలిమి
వారి పక్షాన నిలిచిన- వీరవరుల....(1,2,3).
కం. వారు మహారథు లందరు,
వీరత్వమునందు భీమ- భీభత్స సముల్,
వారల పేర్లెరిగించెద
వేరొక పర్యాయమిపుడు- విన ప్రార్థింతున్..... (4)
సీ. సమర కళాశాస్త్రి -సాత్యకి కలడందు,
రణ పండితుండు- విరాటుడుండె,
పాంచాల పతి వారి -పక్షాన నుండెను,
దృష్టకేతును చేకితానుడుయును,
కాశీ నరేంద్రుండు -కలరు ఆపయి, పురు
జిత్తును కుంతి భో -జేంద్ర నృపుడు
భూపాల శ్రేష్టుండు -శైభ్యుండు కలడందు
మరి యుధామన్యుండు- మరియు నుత్త
మౌజు డభిమన్యు డును నుప -పాండవులను,
వారితో పాటు నెందరో- వీరవరులు
కలరు శత్రు సైన్యమునందు- బలురు వారు
తమరెరుంగుదురైనను -తగ వచిన్తు...... (5, 6)
కం. పరికింపుడు మనపక్షపు
కురువీరుల, విశదపరతు - గురుదేవా, నే
మరల తమ ఎరుక కొరకై,
పరగర్వ నివారణులను,- పటు విక్రములన్...... (7).
సీ. అస్త్ర విద్యాగురు -లార్యులు తమరును,
అనుపమ యోధ్ధ శం-తను సుతుండు,
అసహాయ శూరుండు- అంగ నరేంద్రుండు,
కులగురు డాచార్య -కృప వరుండు,
అతులిత బలశాలి -అయిన అశ్వద్ధామ,
ఆత్మ సోదరుడు వి-కర్ణుడొండు,
రిపులకు యముడు భూ-రిశ్రవు డాదిగా
వీరాధి వీరులు -పెక్కుగలరు,
సర్వులును వారు వివిధాస్త్ర- శస్త్రధరులు,
నా ప్రయోజనమునకు ప్రా-ణంబులయిన
విడువ గలవారు రణరంగ- విద్యలందు
చతురు లతిసాహసికులు ఆ-చార్య దేవ...........(8, 9).
తే. గీ. అంతులేనిది మనసేన- శాంతనవుడు
ఎపుడు రక్షింప ఓటమి -నెరుగ కుండ,
అవల వారిది స్వల్పంబు- అట్టి సేన
గెలువ సుకరంబు కాపాడ- గాలిబిడ్డ......... (10)
కం. మీరలు మీ మీ చోటుల
తీరుగ నిలుచుచును, అన్ని- దిక్కుల క్షేమం
బారసి కావంగా వలె
వీరాగ్రణి భీష్మునెపుడు -వీడక ననిలో......... (11)
కం. కురుపతి పలుకులు తావిని,
కురువృద్ధుడు భీష్ముడతని- కుత్సాహంబున్
పురికొల్పగ పూరించెను
గురు శంఖము తక్షణంబె- గొప్ప రవమునన్...... (12)
తే. గీ. అప్పితామహు శంఖర- వంబుతోడ
శంఖ భేరీ మృదంగాది- శబ్దములతొ
దిక్కులన్నియు మార్మోగె - దేవ యపుడు
పరమ హర్షాన మన వారి -పక్ష మందు......... (13)
తే. గీ. అంత శ్వేతాశ్వముల చేత -అలరు గొప్ప
రథము నందున్న కృష్ణుడు- అర్జునుడును
రిపులు బెగడొంద తాము- పూరించినారు
ఘన రవంబున దివ్య శం-ఖములు స్వామి!....... (14)
సీ. పద్మనాభుండును -పాంచ జన్యం బొత్తె,
తగ నర్జనుడు దేవ-దత్తమొత్తె
భీముడు పౌండ్రమన్- భీమశంఖంబొత్తె
విను ధర్మజుడనంత- విజయ మొత్తె,
మాద్రేయులు సుఘోష- మణిపుష్పకములను
శంఖములొత్తిరి -సంత సమున
ఘనమగు నారి బూ-నిన యోద్ధ కాశికా
రాజు యవ్విధి మహా-రథి శిఖండి
దృష్ట దుమ్నుండు,విరటుండు- దృపదవిభుడు,
సాత్యకియు, ద్రౌపదేయులు, సర్వనృపులు
మరియు అభిమన్యుడును ను వారి -వారి శంఖ
ములును పూరించినారు సం పూర్ణ ధ్వనుల....(15,16,17,18).
తే. గీ. పాండవానీక మొనరించు -పటురవముచె
నెల్ల దిక్కులు మార్మోగె- నల్ల కౌర
వుల మనంబులు అల్ల క -ల్లోలమయ్యె
సమర రంగాన, రాజ, ఆ- సమయమందు...... (19)
కం. అంతట వైరినికాయము
నంతయుగని పార్థుడనెను," అచ్యుత రథమున్,
సుంత తడవు ఇరుసేనల
యంతరమున నిలుపుమయ్య, అప్పుడు నేనున్........ (20, 21)
కం. పరికింతు రెండుసేనల
పరులెవరో, మిత్రులెవరొ,- పవరమేరితో
జరుపంగవలెనొ నేనును
కురుపతికిందోడుపడెడు- కుమతులు యెవరో.,.... (22,23)
కం. అనవిని అంభుజనాభుడు
ఘన స్యందన మపుడురెండు- కక్షలకును మ
ధ్యను నిలబెట్టుచు : "పార్థా!
కనుమయ్యా,భీష్మ ద్రోణ కృప ప్రభృతులన్."........... (24,25)
తరళము.
హరియనంగను అవ్విధంబున- అర్జునుండట గాంచెగా
గురువులన్ మరి పితృతుల్యుల - పుత్రులన్ మరి పౌత్రులన్,
మరుదులన్ మరి ప్రాణ మిత్రుల, - మామలన్ మరి భ్రాతలన్,
గురు తరంబుగ నిరు తెరంగుల -కూడి నిల్చిన యోధులన్........ (26)
తే. గీ. సమరభూమిని పార్థుండు -సకల బంధు
మిత్రులనుగాంచి మిక్కిలి- వేదనయు దయ
క్రమ్ముకొన శోకమొందుచు, కమలనాభు
కాంచి పలికె నీరీతిని- కరిపురీశ!....... (27)
కం. సమరోత్సాహము చేతను
గుమి గూడిరి స్వజనులిందు,- కృష్ణా,వీరిన్
గమనింప శిథిలమాయెను
సుమ నాయంగములు- నోరు శోషతొ నెండెన్........ (28, 29)
తే. గీ. కాయము వడకె, కలిగెను - గగురుబాటు
దేహమందున, నో రెండె, _ధైర్య మణగె,
ఇవల గాండీవమును జారి-పోవు చుండె
కరము నందుండి, చర్మమ్ము- కాలుచుండె....... (30)
తే. గీ. చిత్తము భ్రమించు చుండెను -చెప్పరాని
రీతి, నిలువ లేకుంటిని- ఇప్పుడు నాకు
పెక్కుఅపశకునములుగా-న్పించుచుండె,
అనవసరమేమొ చంపుట- ఆత్మజనుల........ (30.1/2,& 31)
తే. గీ. విజయ మేనియు, సామ్రాజ్య -విభవమేని,
సుఖములేనియు, వలదయ్య - చూడనివియు,
చివరికీ జీవితము కూడ- చిత్రముగను
నిష్ఫలంబని తలచెద- నేను స్వామి!......... (32)
తే. గీ, ఎవరి కొరకయి రాజ్యము -ఎల్ల భోగ
ములను సుఖములు వాం ఛింతు- మిలను నట్టి
వారు ప్రాణములను యొడ్డి- వచ్చి నిలచి
నారు మన ముందు, మాధవా- పోరుసేయ............ (33)
తే. గీ. గురువులును, పితృసములును, -కొమర తుల్యు
లును,పితామహులును, మామ-లును, శ్వశురులు,
మనుమలును, బావమరుదులు,-మరియు ని తర
బంధువులు చేరియున్నారు- పవరమునకు..... (34)
కం. ముల్లోకములు లభించిన
నొల్లను నే చంప వీరి- నో మాధవ, వీ
రెల్లరిని ధరణి కొరకై
ఒల్ల గలన చంప, వారు -తుని మిన నన్నున్.......... (35)
కం. రణమున వీరల తునిమిన
మన కొరిగెడు దేమి వట్టి- పాపము దక్కన్,
విను మిట్టి ఆతతాయుల
నని గూల్చిన నఘమె గల్గు- నయ్యా కృష్ణా!............. (36)
కం. మన చుట్టములగు కౌరవు
లను చంపుట తగునె మనకు,- లబ్ధి యగునెసూ,
మనకును సుఖమావంతయు,
అని తెగటార్చిన స్వజనుల- నంబుజ నాభా !........... (37)
ఉ. వీరలు లుబ్ధచిత్తులయి -
ఏర్పడ తాము ఎరుంగరేమొయీ
పోరున వంశ నాశమున-
పుట్టెడు దోషములంత నాపయిన్
దారుణ మిత్రద్రోహ జని-తంబగు పాతక మంత తెల్సియున్,
దూరముగా వసింపవల- దో మనమైనను త త్క్రియాళికిన్....... (38&39)
ఆ. వె. కులము చెడుట చేత- కులధర్మములు అన్ని
నాశ మగును వడిగ- నంత పాప
మెంతొ పెచ్చు పెరిగి -మీరి మీరి వసించు
నిలచి కులము నందు- నిక్క వముగ............. (40)
కం. కులమున పాపము పెరుగగ
కులకాంతలు చెడుదురంత,- గోవింద అటన్
తల యెత్తు వర్ణ సంకర
విలయంబది తలచుకొనగ- వేదన కలుగున్..... (41)
కం. కులఘాతకులకు, కులముకు
కలుగదె నరకంబు పెద్ద- కాలము పితరుల్
జలతర్పణ శ్రార్ధములను
ఇల పొందక గతులు సెడగ,- ఎంతయొ కృంగన్......... (42)
తే. గీ. వర్ణ సంకరమున సంభ-వమగుదోష
మలును, చెడిపోవు కుల ధర్మ- ములును, జాతి
ధర్మములు కూడ నరకము- తజ్జనులకు,
నిరవధిక ప్రాప్తి యని మున్ను- నేను వింటి....... (43 &44)
తే. గీ. మనము మతిమంతులయ్యు, సా-మ్రాజ్య సుఖము
లందుకొనగోరి మనవారి- నందరిని ర
ణమున చంపుట కుద్యక్తు- లయితి మేమి!
ఎంత దారుణ మక్కటా- ఎరిగి ఎరిగి!....... (45)
తే. గీ. ఆయుధంబులు ధరియింప-నట్టి నన్ను
వైరులొక వేళ చంపిన- సరియె శస్త్ర
పాణులయి నేను పోరాట- మందు లేక
పోయినను అదె నాకును- పుణ్యమొసగు....... (46)
కం. అనె నిట్లుసంజయుడు:" అ
ర్జునుడటు వచియించి పరమ శోకాత్ముండై
ధనువును శరముల విడి స్యం
దనమున కూలబడె వెనుక ధృతరాష్ట్ర విభో!"........(47)
-:ప్రథమోథ్యాయము సమాప్తము :-
Comments
Post a Comment